గణేష్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా జరుగుతున్నాయి. ఎక్కడ ఎంత గ్రాండ్గా జరిగిన తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు జరిగే తీరు మాత్రం చాలా స్పెషల్. ఇక్కడ విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం, లడ్డూ వేలం ఇలా ప్రతి ఒక్క ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నెన్ని విగ్రహాలు పెడుతున్నా… అందరి చూపు తెలుగు రాష్ట్రాల వైపు ఉంటుంది. మరోసారి తమ స్పెషాలిటీ నిరూపించుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పూజా కమిటీలు. వైవిధ్యమైన విగ్రహాలు ఏర్పాటులోనే కాకుండా లడ్డూ వేలం పాటలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టాక్ఆఫ్ది కంట్రీగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో బాలాపూర్ గణేష్ లడ్డు ఒకటి
ఇప్పుడు అందరి కళ్లూ బాలాపూర్ లడ్డూపైనే! ఎందుకంటే, గణేష్ లడ్డూల్లో బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతే వేరు. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం. కొత్త తీసుకొచ్చిన రూల్ ప్రకారం ముందుగా గతేడాది లడ్డూ అమ్ముడుపోయిన ధర డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అందుకే చాలా తక్కువ మంది ఈ డబ్బులు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో అమ్మడుపోయింది. దీంతో ఆ 27 లక్షలు డిపాజిట్ చేసిన కొద్ది మంది మాత్రమే ఈ వేలంలో పాల్గొన్నారు.
గతేడాది ఆక్షన్లో పాల్గొన్న వ్యక్తి కూడా ఈసారి 27 లక్షలు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. పోటీలో ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ పోటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పోటీలో ఉన్న కొద్ది మంది లడ్డూ కోసం హోరాహోరీగా తలపడ్డారు. చివరకు 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు స్థానికులు సింగిల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా బాలాపూర్ లడ్డూ వేలానికి 30ఏళ్ల చరిత్ర ఉంది. 1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ.. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర.. ప్రతి ఏటా రికార్డు ధర పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాలాపూర్ లడ్డూ. 2002 నుంచి లక్షల్లోకి చేరి ఎప్పటికప్పుడు తన రికార్డులనే తానే బ్రేక్ చేసుకుంటూ వస్తుంది బాలాపూర్ లడ్డు. గతేడాది 27లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి అంతకంటే ఎక్కువ పలికింది.