ఆ నలుగురు నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్నారు.. ఎన్నికల బరిలోకి దిగి తీవ్రంగా చమటోడ్చారు. కానీ చివరికి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నిరాశ పడలేదు.. వెనకడుగు వేయలేదు. ఒకటిపోతే దానికంటే మించినది మరొకటి దొరుకతది అన్నట్లు.. ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగారు. విజయకేతనం ఎగురవేశారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వారే తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్.
2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఎట్టి పరిస్థితిలోనైనా గజ్వేల్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించి తీరుతానని శపథం చేశారు. కానీ పోటీ చేసిన రెండు చోట్ల ఈటల ఓటమిపాలయ్యారు. తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో 16,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు గజ్వేల్‌లో కేసీఆర్ చేతిలో 45,031 ఓట్ల తేడితో ఓడారు. రెండు చోట్ల ఓడిన ఈటల పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిపై 3.92 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్ కూడా కరీంనగర్ నుంచి పోటీ చేశారు. అప్పటికే ఆయన కరీంనగర్ ఎంపీ అయినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో 3163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగారు. వరుసగా రెండోసారి కరీంనగర్ నుంచి బండి సంజయ్ 2,25,209 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అటు దుబ్బాక నుంచి రఘునందన్ రావు.. కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్‌లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వారిద్దరు కూడా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రఘునందన్ రావు పోటీ చేసి 49 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు ధర్మపురి అరవింద్ మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసవారు. రెండోసారి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో అరవింద్ గెలుపొందారు. ఇలా ఈ నలుగురు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY