బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హరీశ్ రావుని పరామర్శించారు.
ఈ మేరకు నేటి మధ్యాహ్నం హరీశ్ ఇంటికి వెళ్లిన ఆయన, సత్యనారాయణ రావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా సత్యనారాయణ రావు కేసీఆర్‌కి వరసకు బావ అన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఏడవ సోదరి లక్ష్మి భర్తే సత్యనారాయణ రావు. ఈ క్రమంలో తన బావ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేసీఆర్, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అనంతరం తన సోదరి లక్ష్మిని మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా హరీశ్ రావుని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సత్యనారాయణ రావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసారు.






































