బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్‌ను కొళ్లగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్ గౌడ్, కాలేరు యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ పోచారం శ్రీనివాస రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇటీవల రాత్రికి రాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే వీరితో పాట పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడే అదే నిజమయింది. గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి.. మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహిపాల్ రెడ్డితో పాటు ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన గాలి అనిల్ కుమార్.. మరికొంత మంది కార్పోరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరేకాకుండా రానున్న రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు.. కీలక నేతలు బీఆర్ఎస్‌ను వీడి.. అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అయితే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడం మాత్రం బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు.
ఇకపోతే తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో చేరారు. 2014 లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో పటాన్ చెరు నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థ స్వప్నదేవ్‌పై 18,886 ఓట్ల తేడాతో మహిపాల్ రెడ్డి గెలుపొందారు. 2018లోనూ మరోసారి బీఆర్ఎస్ తరుపున పటాన్ చెరు నుంచి బరిలోకి దిగిన మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్‌పై 37,699 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. గతేడాది జరిగిన ఎన్నికలవేళ మూడోసారి కేసీఆర్.. మహిపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈక్రమంలో మూడోసారి పటాన్ చెరు నుంచి మహిపాల్ రెడ్డి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. తాజాగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.
అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. రాష్ట్రమంతటా తమ ప్రభావం చూపించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం సల్లబడిపోయింది. హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌దే హవా కొనసాగింది. ఇక్కడ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్‌కే దక్కాయి. దీంతో కాంగ్రెస్ జీహెచ్‌ఎంసీపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే మరికొంత జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే బీఆర్ఎస్ మనుగడ కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ