పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా ఉన‍్న విధానంలో మార్పులు చేసిన విద్యాశాఖ…ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఇప్పటి వరకూ ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇంతకాలం 80 మార్కులకు వార్షిక పరీక్షలు జరగగా, 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులుగా కేటాయించారు. తాజా నిర్ణయంతో 100 మార్కులకు ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.
మరోవైపు పదోతరగతి ఎగ్జామ్స్ కోసం.. పరీక్ష ఫీజుల చెల్లింపు జరుగుతోంది. డిసెంబర్ 5 వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపు… రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 12 వరకు చెల్లించొచ్చు. డిసెంబర్ 19 వరకు అయితే రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అంతేకాదు డిసెంబర్ 30 వరకు రూ.500 ఫైన్‌తో ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
పాఠశాలల చేతిలో ఇప్పటి వరకూ ఇంటర్నల్ మార్కులు వేసే అకాశం ఉండడంతో.. యాజమాన్యాలు ఇష్టానుసారం మార్కులు వేస్తున్నారు. విద్యార్థులు చదువులో వెనుకబడినా కూడా 15 పైగా ఇంటర్నల్ మార్కులు వేస్తుండటంతో.. జీపీఏలలో తేడా వస్తోంది. దీనివల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారని గ్రహించిన ప్రభుత్వం..ఇకపై ఇంటర‍్నల్ మార్కులను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.