చారిత్రాత్మక కట్టమైన చార్మినార్ నుంచి గురువారం పెచ్చులు ఊడిపడటంతో హైదరాబాదీల్లో భయాందోళన నెలకొంది. హైదరాబాద్ ఐకానిక్ నిర్మాణం అయిన చార్మినార్ 450 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ నిర్మాణమే. నిజాంలు నిర్మించిన ఈ కట్టడానికి అక్కడక్కడా డ్యామేజీ జరగడం..వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతుల చేయడం షరా మామూలు అయింది.
భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న భాగంలో చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.అదృష్టవశాత్తూ పెచ్చులూడే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించి..చార్మినార్‌కు మరోసారి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. అయితే గతంలో మరమ్మతులు జరిగిన చోటే మళ్లీ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన చార్మినార్ నిర్వహణపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
భారీ వర్షంతోనే ఈ ఘటన జరిగినా..చార్మినార్ వంటి చారిత్రక కట్టడాల సంరక్షణపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే అనేక మరమ్మతులతో ఎప్పటికప్పుడు టచ్ అప్ లు చేస్తున్నట్లుగా మరమ్మతులు చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో చార్మినార్ భద్రత గురించి పట్టించుకోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
చారిత్రాత్మక కట్టడానికి భావి తరాలు కూడా చూసేలా తగు చర్యలు తీసుకోవాలని.. గత వైభవానికి గురుతులను నిర్లక్ష్యంతో కాలగర్భాన కలిపేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా చార్మినార్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.