రేపట్నుంచి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు..

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటల30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 9:35 వరకు విద్యార్ధులను అనుమతిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇచ్చినట్లుగానే 5 నిమిషాలు గ్రేస్ టైమ్ ఇస్తామని.. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చిచెప్పింది.

ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్ధుల హాల్‌టికెట్లు విడుదల చేశామని, వెబ్‌సైట్‌ నుంచి నేరుగా విద్యార్ధులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాంపోజిట్‌ పేపర్లకు పరీక్ష రాసేవారికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

పేపర్లు లీకేజీని అరికట్టడానికి ప్రశ్నపత్రాలపై మొదటి సారిగా క్యూఆర్‌ కోడ్‌ను కూడా ముద్రిస్తున్నారు. అంతేకాకుండా తొలిసారిగా ఒక్కో పేపర్‌పై ఒక యూనిక్‌ నంబర్‌ను కూడా ముద్రిస్తున్నారు. ఈ యూనిక్‌ నంబర్‌ ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై ఉంటుంది.ఇక సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు ఎగ్జామ్స్‌ను రెండు రోజుల్లో వేర్వేరుగా నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకే నిర్వహిస్తారు. మ్యాథ్స్ పరీక్ష రోజు గ్రాఫ్‌ పేపర్‌ విడిగా ఇస్తారు.

సీఎస్‌డీవో గదుల్లో సీసీ కెమెరాల నిఘాలో టెన్త్ ప్రశ్నపత్రాల బండిల్స్ తెరుస్తారు. కాగా ఈ సంవత్సరం తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తున్నారు. ఆ బుక్‌లెట్‌లోని పేజీల్లోనే విద్యార్థులు ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. అడిషనల్‌ కావాలన్నా కూడా ఇస్తారు. మరోవైపు పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్‌ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలి.దీనికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.