రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని అని, ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నదని, అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు.
మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన, 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్కను మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సీఎం కేసీఆర్ సన్మానించారు.
జూన్ 3 నుంచి 15 రోజులపాటు రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ:
అలాగే వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మే 20 నుంచి నిర్వహించతలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు సీఎంను కోరారు. వారి విజ్ఞప్తి మేరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు.
జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదని అన్నారు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవానుకోవడం సమర్థనీయం కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF