కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చి వేసింది: సీఎం కేసీఆర్

CM KCR Visit Kaleshwaram Project Today, CM KCR Visits Mukteswara Swamy Temple, kaleshwaram, Kaleshwaram Project, kaleshwaram project news, kcr kaleshwaram project, KCR Reviews Kaleshwaram Project, Mango News, Mukteswara Swamy, Mukteswara Swamy Temple, Mukteswara Swamy Temple in Kaleshwaram, telangana, Telangana CM KCR

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను సీఎం అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే రాష్ట్రంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. మంగళవారం నాడు మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని సీఎం కేసీఆర్ సందర్శించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను సీఎం నెమరు వేసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి వేసింది: 

‘‘సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారేజీ నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించాం. వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. 16.17 టిఎంసీల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశాం. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నది. 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టింఎంసీల నీరు నిలువ వున్నది. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి. నీటి పంపింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతున్నది. మేడిగడ్డ పాయింట్ నుండి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిలువ ఉండడంతో జలకళ ఉట్టి పడుతున్నది. బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

“ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రతీ ఏటా నీరందుతుంది. నిజాంసాగర్ కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవసరమైన పక్షంలో ఎస్.ఆర్.ఎస్.పి కూడా ఈ ప్రాజెక్టు నుండే నీటి పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీంటిని త్వరితగతిన పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపుమాపలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని సీఎం చెప్పారు.

తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా వుంది:

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై 365 రోజులు పనిచేశారు. భూసేకరణతో పాటు వివిధ క్రాసింగ్ లకు సంబంధించిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్ధవంతంగా పరిష్కరించారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి రావడం ఎంతో సంతోషంగా వుంది. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా వుంది. మేడిగడ్డ బ్యారేజీ, తుపాకుల గుడెం బ్యారేజి, దుమ్ముగూడెం బ్యారేజీల వల్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. సమయానుగుణంగా రూల్స్ ను అమలు చేయాలి’’ అని సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఇఎన్సీలు మురళీధరర్ రావు, వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పెద్దపల్లి-వరంగల్ రూరల్ జడ్పీ చెర్ పర్సన్లు పుట్ట మధు, గండ్ర జ్యోతి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, కోరుకంటి చందర్, దివాకర్ రావు, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ