తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఇతర సదుపాయాలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే అక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మరియు వైద్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించనున్నట్టు తెలుస్తుంది.
ముందుగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని హెలిపాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడినుంచి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి వరంగల్ సెంట్రల్ జైలు సందర్శనకు వెళ్లనున్నారు. జైలు సందర్శన తర్వాత మళ్ళీ కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి చేరుకొని మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి, కరోనా బాధితులకు ధైర్యం చెప్పనున్నారు. అలాగే జిల్లాలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఏర్పాట్లపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరపనున్నట్టు సమాచారం. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ