గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల ధాటికి 5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడంతో పాటు విద్యుత్ సబ్‌స్టేషన్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా 5వేల 438 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అంచనా వేశామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల్లో జరిగిన వరద నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించి కేంద్రానికి అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
నిన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి. అక్కడి హృదయ విదారకర దృశ్యాలు ఆయన్ని బాగా కదిలించాయి. ఖమ్మంలో మున్నేరు వరద మిగిల్చిన విషాదం చూసి చలించిపోయానన్నారు. ప్రకృతి విలయంలో నష్టపోయిన బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. జిల్లాలో ఇళ్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే ఆస్తి, పంట నష్టాలపై అధికారులు త్వరగా అంచనా వేసి, రిపోర్టు ఇస్తే దాన్ని బట్టీ పరిహారం ఇస్తామని అన్నారు. ఈ వరదల్లో చాలా మంది సర్టిఫికెట్లు కోల్పోయారని తెలియడంతో.. వారికి కొత్త సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. కాగా ఈ వర్షాలు, వరదల వల్ల తెలంగాణలో ఏకంగా 16 మంది చనిపోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఇది చాలా బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కాగా నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే మార్గంలో కోదాడలో కూడా పర్యటిస్తారు. నష్టాన్ని అంచనా వేసి సహాయ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతి పెరుగుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు భారీ వర్షాల కారణంగా నిండుకుండలా మారింది. వచ్చింది వాయుగుండమే అయినా.. తుపాన్ను మించిన వాయుగండంలా మారింది. ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణ కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టేలా ఉంది.