ఖమ్మం జిల్లా వాసులు ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను రేవంత్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్బంగా వైరా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని..బిఆర్ఎస్ పార్టీ పై, మాజీ సీఎం కేసీఆర్ , హరీష్ రావు లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్ రాజీనామా చేయాలంటూ ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. హరీష్‌రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయిందని సెటైర్లు వేశారు.
హరీశ్ రావు రియాక్షన్…
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరన్నారు. తాము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యిందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా…? ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రేవంత్ ను చూసి అబద్దం కూడా సిగ్గుపడి మూసిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా ఉందన్నారు హరీష్ రావు. ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నాడు అంటూ హరీశ్ రావు బదులిచ్చారు. రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలోనే తానే స్వయంగా వెళతానన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తానంటూ హరీశ్ కౌంటర్ ఇచ్చారు.