తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మారుస్తున్న అంశంపై రాజకీయ విమర్శలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Assembly సమావేశాల్లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, పేరు మార్పును కులపోరుగా మార్చాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. పాలనాపరమైన సమర్థత దృష్ట్యా, రాష్ట్ర నిర్మాణానికి కీలకంగా సహకరించిన గొప్ప వ్యక్తుల పేర్లను యూనివర్సిటీలకు పెడుతున్నామని వివరించారు.
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత పదేళ్లలో చేపట్టిన ఈ మార్పుల వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో పాలనలో మార్పులు చేయడం సహజమని, అందులో భాగంగానే కొన్ని యూనివర్సిటీల పేర్లు మార్చడం జరిగిందన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చేలా, ఇక్కడి భాష, సంస్కృతి, ఉద్యమ నాయకుల్ని గౌరవించేదిలా ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టంచేశారు.
ఒకే పేరుతో రెండు వర్సిటీలు ఉంటే పరిపాలనా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అందుకే తెలంగాణ యూనివర్సిటీలకు సంబంధిత నాయకుల పేర్లు పెట్టినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు ఇచ్చినట్టు తెలిపారు.
అంత మాత్రానా ఎవరినీ అగౌరవపరచడం లేదా తక్కువ చేయడం ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరు తొలగించి మోదీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, తమ చర్యలు రాజకీయ కోణం లేనివేనని తేల్చిచెప్పారు.