యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్షించిన సీఎం రేవంత్.. రాజకీయాలకు తావు లేకుండా, ఆలయ పవిత్రత ఏమాత్రం దెబ్బతినకుండా బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు.
కాగా ప్రత్యేక బోర్డు ఏర్పాటయితే ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఆలయానికి వచ్చే నిధులు, కానుకల ద్వారా ఆలయ అభివృద్ధి పనులు చేపడతారు. యాదగిరిగుట్ట ఆలయంతో పాట.. అనుబంధ ఆలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా.. బోర్డు ద్వారానే అన్ని అభివృద్ది పనులు చేస్తారు. భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు, నిత్యాన్నదానం వంటివి అందుబాటులోకి వస్తాయి.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట టెంపుల్ మెుదటి స్థానంలో ఉంటుంది. తెలంగాణ తిరుపతిగా ఈ యాదగిరిగుట్ట ఆలయాన్నిపిలుచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి వెంకన్న తర్వాత..యాదగిరిగుట్ట నరిశింహుడినే ఎక్కువ మంది దర్శించుకుంటారు.
యాదగిని పుణ్యక్షేత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని తొలగించి దాని స్థానంలో సకల హంగులతో కొత్తగా పునర్నిర్మాణాన్ని చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. ప్రస్తుతం వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకొని గుట్ట మీద ఉన్న నర్సన్నకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే బీఆర్ఆఎస్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని యాదాద్రిగా నామకరణం చేయగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పేరు యాదగిరిగుట్టనే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఇప్పుడు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని మరో నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. దానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై జనవరి 29న సమీక్ష నిర్వహించిన సీఎం ..ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో అధికారులకు కొన్ని మార్పులను కూడా సూచించారు.
తిరుమల తరహాలానే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో కూడా ఎటువంటి రాజకీయాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఆలయ పవిత్రకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కాగా, యాదగిరిగుట్టకు కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.