తెలంగాణలో కాగ్నిజెంట్ కంపెనీ భారీ విస్తరణకు రెడీ అయ్యింది. కొద్ది రోజులుగా ఆర్ధిక మాంద్యం పేరుతో కాస్త డల్ అయినా మళ్లీ తిరిగి ఐటీ రంగం దూసుకెళ్తున్న తరుణంలో.. ప్రపంచ స్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మరో కొత్త కంపెనీ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది.కొత్తగా వస్తున్న కాగ్నిజెంట్ కంపెనీ వల్ల దాదాపు 15వేల మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో తమ కొత్త సెంటర్‌ను కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు చేయనుంది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు..కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో పాటు ఆ కంపెనీ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాగ్నజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం జరిగినట్లు సీఎంఓ తెలిపింది. గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటనలో ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి.
టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారిన టెక్ హబ్ హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించటం చాలా సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ చెప్పారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్..ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించడానికి ఉపయోగపడుతుందని కాగ్నిజెంట్ సీఈవో అన్నారు.తమ కంపెనీ ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో కూడా అత్యాధునిక పరిష్కారాలు అందిస్తుందని ఎస్.రవికుమార్ చెప్పారు.
ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో.. ప్రపంచస్థాయి టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్‌కు తమ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని ప్రకటించారు. కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తుందని.. అలాగే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.