ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసిన హైడ్రా పేరు తెగ హల్ చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువుల పరిధిలో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు అదనపు పవర్స్ కూడా వచ్చేలా చేశారు. హైడ్రా కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్, సిబ్బందిని సైతంకేటాయించారు. అంతే కాకుండా.. హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చారు. దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ హైడ్రా వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నతాధికారుల మధ్య వార్ కు తెరతీసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి మధ్య తాజా పరిణామాలతో వారి మధ్య కోల్డ్ వారు కొనసాగుతుందని అధికారిక వర్గాలలోను, రాజకీయ వర్గాలలోను చర్చ జరుగుతుంది. మొదట్లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు జిహెచ్ఎంసిలో పనిచేసే కొంత మంది విజిలెన్స్ సిబ్బందిని హైడ్రా కోసం కేటాయించారు.
ఇక ఈ సిబ్బంది హైడ్రా కోసం విధులు నిర్వర్తించడంతో జిహెచ్ఎంసి పరిధిలో వారు చేయాల్సిన పనులు పూర్తికాక అక్కడ పాలన ఇబ్బందికరంగా మారిందనీ ఈ విషయం అధికారులు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాటా దృష్టికి తీసుకువెళ్లారట.. జిహెచ్ఎంసి నుంచి కేటాయించిన విజిలెన్స్ అధికారులను తిరిగి తమ శాఖకు పంపించాలని హైడ్రా నుంచి రిలీవ్ చేయాలని ఆమె హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు లేఖ రాశారు. హైడ్రా పరిధిలో పనిచేస్తూ శాలరీలు మాత్రం జిహెచ్ఎంసి నుంచి తీసుకుంటున్న ఉద్యోగులు తిరిగి బల్దియాకు రావాలని డెడ్లైన్ విధించి జిహెచ్ఎంసి విధుల్లోకి రాకుంటే శాలరీలు సైతం నిలిపివేయాలని ఆర్థిక శాఖకు అమ్రపాలి లేఖ రాసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రాలోనే పనిచేస్తున్నారని సమాచారం.దీంతో ఆమ్రపాలి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా హైడ్రా వ్యవస్థతో గ్రేటర్ హైదరాబాద్ పైన బలమైన ముద్ర వేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి మధ్య తాజా పరిణామాలతో వార్ పీక్స్ కు చేరుతుందని రాజకీయ వర్గాలలో, అధికారిక వర్గాలలో చర్చ జరుగుతుంది.