ఆడపిల్లల కోసం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్

Collector Launches New Policy For Girl Children

పోలీస్ అధికారులు అయినా, ఐఏఎస్ అధికారులు అయినా అంతా ఒకేలా ఉండరు. కొందరు రెగ్యులర్ ఉద్యోగ విధులు నిర్వహిస్తుంటే.. మరికొందరు మాత్రం సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుంటారు. తాజాగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమాజ సేవలో భాగమవుతూ అందరితోనూ శభాస్ అన్పించుకుంటుంది .

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆదర్శ్ సురభి.. కొంతకాలం క్రితం వనపర్తి జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత ఏర్పడిన జిల్లా.. వనపర్తి. వనపర్తి పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుంది. ఇక్కడ అన్ని వర్గాల వారు ఉంటున్నా కూడా పేదల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు.

దీనిని రూపుమాపడానికే ఇప్పుడు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దీనిలో బాగంగానే తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడానికి తనవంతు బాధ్యతను స్వీకరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అందమైన పెయింటింగ్స్ వేయించారు. దీనిలో బాలిక విద్య ఆవశ్యకతను ఆదర్శ్ ప్రముఖంగా ప్రస్తావించేలా చేశారు. హైదరాబాద్ నుంచి పేరొందిన త్రీడీ ఆర్టిస్టులను పిలిపించి.. గోడలపై పెయింటింగ్స్ వేయించారు. అందులో ఒక చిత్రం మాత్రం తెగ ఆకట్టుకుంటూ ఏకంగా సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది.

వనపర్తి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ స్కూలుపై గోడపై కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో త్రీడీ ఆర్టిస్టులు ఒక అందమైన చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో.. ఒక బాలిక తను చదువుకొని.. జీవితంలో స్థిరపడి.. ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు.. తలపైన కిరీటం పెట్టుకున్నట్టు ఉంది. మీ అమ్మాయిని చదివిస్తే.. ఆమెకు అచంచలమైన ఆత్మవిశ్వాసం లభించి ఆమె ఒక సింహాసనంలో కూర్చుని.. మహారాణిలా కిరీటం ధరిస్తుంది. అలా జరగాలంటే ఆమెను చదివించాలి. ఆమె కలలకు రంగులు అద్దాలి. ఆమె ఆశలకు ప్రాణం పోసి.. ఆమె ఆనందానికి జీవం ఇవ్వాలి. ఆమె సంతోషానికి భరోసా ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే ఆమె కచ్చితంగా చదువుకోవాలి. చదువుతోనే భవిత. చదువుతూనే భవిష్యత్తు.. చదువుతోనే వెలుగు.. చదువుతోనే విద్వత్తు.. అని అర్థం వచ్చేలాగా ఆ చిత్రాన్ని రూపొందించారు.

వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో అవి తగ్గుముఖం పట్టినా కూడా.. ఇంకా పూర్తిస్థాయిలో తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వనపర్తి కావడంతో.. అధికారులు బాల్యవివాహాలను రూపుమాపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా బాలిక విద్యను.. బాలిక సాధికారతను వివరించే విధంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనిలో భాగంగా..వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ త్రీడి చిత్రం చూపరులను ఆకట్టుకుంటూ చివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.