నవంబర్ ఆరు నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టాలని..రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.ఆస్తులు,అప్పుల వరకూ, తినే తిండి, వాడే వాహనాలు, వ్యక్తులు అనుభవించే పదవులు, హోదాల వరకు ఇలా అన్ని కూడా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. పౌరుల ఆరోగ్య సమస్యలు, వారికున్న సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులను కూడా దీనిలో విధిగా పొందుపరచాలని సూచించింది. మొత్తం 54 అంశాలతో కూడిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణనను సర్కార్ చేపట్టబోతోంది.దీనికి సంబంధిత ఫార్మాట్‌ను తెలంగాణ ప్రణాళికా శాఖ ఇప్పటికే రూపొందించింది.
మొత్తం 54 ప్రశ్నలతో కూడిన ఏడు పేజీలను ప్రభుత్వం ఒక నమూనాగా ప్రచురించింది. ఈ ఫార్మాట్లో ఆయా వ్యక్తుల ఆస్తులతో పాటు రిజర్వేషన్ల ద్వారా పొందిన ఉద్యోగాలు, పదవులు, ఇతర హోదాలను సైతం పొందుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంటి నంబర్ల కోసం ప్రత్యేక కోడ్‌ను కేటాయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం… 2014లో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్కరోజులో ఆ సర్వేను పూర్తి చేసింది. అయితే అందులోని విషయాలను ఇప్పటి వరకూ బయట పెట్టలేదు.
దీంతోనే తాము మరోసారి సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కుల గణనను చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా, ఆరోపణలు రాకుండా ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో పారదర్శకతకు పెద్ద పీట వేయడానికి నిర్ణయం తీసుకుంది. దీనికోసం సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ అనే సంస్థ ప్రతినిధులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుని.. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు
మొత్తం మూడు వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ సర్వే కోసం వారిని అధికారులు వినియోగించనున్నారు. సర్వే కారణంతో అధికారులు, సిబ్బంది 15 రోజులపాటు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 1.10 కోట్ల కుటుంబాలపై అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 54 ప్రశ్నలను సర్వే ఫార్మాట్లో చేర్చగా, దీనిలో సగం వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించినవి మిగిలిన సగం వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించినవి ఉన్నాయి.
కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని, సభ్యులు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, కులానికి సంబంధించిన ఇతర పేర్లు, వయస్సు, మాతృభాష, ఆధార్ నంబర్లను ఈ సర్వేలో సేకరించనున్నారు. అలాగే ఓటర్ ఐడీ కార్డు,వివాహం వివరాలు, పిల్లల చదువు వివరాలు మొదలగు అంశాలను సేకరిస్తారు.
అలాగే కుటుంబ సభ్యుల వృత్తి, ఉపాధి, ఉద్యోగం, రోజువారీ వేతనాల, కుటుంబ సభ్యులకున్న జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు, భూమి, ధరణి పాస్ బుక్కులు, భూమిపై తీసుకున్న రుణాల వివరాలతో పాటు పశుసంపద, ఇతర పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు నమోదు చేసుకుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యుల స్థిరచరాస్థులు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తారు.
ప్రస్తుతం తెలంగాణలో 3.80 కోట్లకు పైగా జనాభా ఉంది. మొత్తం కుటుంబాల సంఖ్య 1.10 కోట్లు దాటిందని అధికారికంగా అంచనా వేస్తున్నారు. ప్రతీ 150 కుటుంబాలకు ఓ సర్వే గణకుడిని నియమించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన సర్వే కోసం మొత్తం 75 వేల మంది అవసరపడగా.. పర్యవేక్షకులుగా మరో 15 వేల మంది అవసరమవుతారు. టీచర్లను పంపకుండా..15 వేల మంది ఇతర ఉద్యోగులను ఈ సర్వే కోసం నియమించనున్నారు. వీళ్లందరూ 15 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. ఆ నివేదికను మొత్తం 60 రోజుల్లోగా ప్రభుత్వం తమకు అందించాలని అధికారులను ఆదేశించింది.