మండుటెండల్లో కూల్ కబురు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోత, వేడిగాలుల వల్ల.. పనుల కోసం బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

మే నెలలో కనిపించాల్సిన ఇలాంటి వాతావారణం ఇప్పుడు మార్చిలోనే కనిపిస్తుండటంతో.. అప్పుడు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్లు 43 డిగ్రీల మార్కును దాటేశాయి.

అయితే ఇలాంటి సమయంలో తెలంగాణలో రేపు వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా ప్రస్తుతం దక్షిణ, ఆగ్నేయ గాలులు ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు కూడా ఎండల ప్రభావం కొనసాగనుంది.

ఈరోజు గరిష్టంగా మెదక్, నిజామాబాద్‌లో 40.1 డిగ్రీలు..కనిష్టంగా నల్లగొండ, హనుమకొండ జిల్లాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అలాగే ఉరుములు,మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పింది.

మరోవైపు ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలో తీవ్రత పెరిగిపోతుండటంతో పాటు.. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 20 మండలాలు, పార్వతీపురం మన్యంలో14 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాలు, కాకినాడ జిల్లాలో 3 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో.. వడగాలుల ప్రభావం చూపే అవకాశమున్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.