తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSFDC) ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డిసెంబర్ 7న అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
కాగా దిల్ రాజు TSFDC చైర్మెన్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి లు ఓ ప్రకటనలో తెలిపారు. 18-12-2024 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ ఎఫ్.డి.సి కాంప్లెక్స్, ఏ.సి. గార్డ్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
సినీ పరిశ్రమలో దిల్ రాజు ప్రయాణం:
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో ‘పెళ్లి పందిరి’ సినిమాతో పంపిణీదారుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి 2003లో ‘దిల్’ అనే సినిమాతో తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. అప్పటి నుంచి టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. చిన్న సినిమాలు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయన నియామకం చిత్ర పరిశ్రమలో మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. సినీ పరిశ్రమలో ఆయన అనుభవం, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో కీలక సభ్యుడిగా ఆయన చురుకైన పాత్ర తదితర కారణాల వల్ల ప్రభుత్వం ఈ కీలక పదవిని ఆయనకు అప్పగించింది. ఈ నియామకం సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి నాణ్యమైన సినిమాలను ప్రోత్సహించి పరిశ్రమ విస్తరణకు దోహదపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దిల్ రాజు సినీ పరిశ్రమలో ప్రభుత్వ సంబంధాల వారధిగా కూడా చురుకుగా వ్యవహరిస్తూ తనపై నమ్మకాన్ని పెంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు వైఖరిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నియామకం సినీ పరిశ్రమ అభివృద్ధికి గేమ్-చేంజర్‌గా నిలిచేనా? లేక కేవలం రాజకీయ ప్రయోజనాల పరిమితిగా మిగిలిపోతుందా? అన్నది చూడాల్సిన విషయమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దిల్ రాజు ఇటీవలే ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే ప్రత్యేక సంస్థను ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా కొత్త నటీనటులు, దర్శకులు, రచయితలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఏడాదికి కనీసం ఐదు చిత్రాలు నిర్మించాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాలు:
ప్రస్తుతం దిల్ రాజు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్–శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2025 జనవరి 10న విడుదల కానుంది. అలాగే అగ్ర కథానాయకుడు వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నితిన్–వేణు శ్రీరామ్ కాంబోలో ‘తమ్ముడు’ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
దిల్ రాజు కు నిర్మాతగా, పంపిణీదారుగా 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆయనకు ఈ పదవి మరింత బాధ్యతను కలిగించనుంది. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడైన దిల్ రాజు నిజమైన గేమ్-చేంజర్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో చాలా మంది విశ్వసిస్తున్నారు.