ఇకపై రేషన్ కార్డు వాడకంలో మార్పులు తప్పవు. మీ ఇంట్లో ఎవరి పేర్లు రేషన్ కార్డులో ఉన్నా, వారు ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేసుకోవడం తప్పనిసరి. ఈ ప్రక్రియను ఇప్పటికీ పూర్తిచేయని వారు వెంటనే దగ్గరలోని రేషన్ షాపునకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఆధార్ నమోదు కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన చివరి తేదీ ఏప్రిల్ 30. ఈ గడువులోపు ఈ-కేవైసీ చేయకపోతే, రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద తీసుకుంటున్న చర్యల్లో ఒకటి. దీని ద్వారా నకిలీ కార్డులు, చనిపోయిన వారి పేర్లు లేదా దేశంలో లేని వారి వివరాలను తొలగించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ బడ్జెట్‌ను ఆదా చేయనుంది. మార్చి 31తోనే ఈ ప్రక్రియ పూర్తి కావలసినదైనా, ప్రజల సౌకర్యం కోసం ఏప్రిల్ 30 వరకు గడువు పెంచారు. అయితే, ఆ తరువాత గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇకపోతే, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అలాగే, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులు అవసరమైతే “మీ సేవా” కేంద్రాల ద్వారా అప్లై చేయవచ్చు. అధికారుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల మంజూరులో గందరగోళం కొనసాగింది. మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వల్ల అనర్హులకూ రేషన్ వస్తోంది. ఈ-కేవైసీ పూర్తయిన తర్వాత, అర్హులకే లబ్ధి అందేలా మారనుంది. అలా కొత్త కార్డుల జారీకి మార్గం సుగమమవుతుంది.