మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు.
గత ఏడాది జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో అధికారులు దాడులు చేశారు. ఈడీ సోదాల్లో కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పీజీ మెడికల్ సీట్లు ఇల్లీగల్ గా బ్లాక్ చేసినట్లుగా కూడా గుర్తించారు. తెలంగాణలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 45 సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నట్లు ఈడీ తేల్చింది.
దీనికి సంబంధించి ఈడీ అధికారులు మల్లారెడ్డిని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఈడీ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రెండు రోజుల పాటు సోదాలు చేసింది. లెక్కలు చూపని కోటి 40 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. కాలేజీకి సంబంధించిన అకౌంట్లలో రెండు కోట్ల 89 లక్షలు నగదును సీజ్ చేసింది. 2022 ఏప్రిల్‌లో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పీజీ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి అమ్ముకున్నారంటూ మెడికల్ యూనివర్సిటీ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ రంగంలోకి దాడులు చేసింది. అప్పుడు సోదాల్లో లభించిన పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అన్నింటిని విశ్లేషించిన ఈడీ అధికారులు..తాజాగా మల్లారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2022 నవంబర్ లో ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. మల్లారెడ్డికి సంబంధించిన ఆఫీసులు, బంధువుల ఇళ్లలో దాడులు చేశారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో కూడా సోదాలు చేశారు. ఆయన కూతురు, కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లోనూ దాడులు చేశారు.మల్లారెడ్డికి మెడికల్ కాలేజీలే కాకుండా ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి.మల్లారెడ్డి విద్యాసంస్థలు స్థాపించి భారీగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి చెరువులను ఆక్రమించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.