తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్ధమైందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతుండగా, హైదరాబాద్‌లో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ నేతలతో రెండు రోజుల పాటు కీలక చర్చలు జరిపారు. చివరికి అధికారం ఈటల వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.
ఇప్పటివరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీని నడిపించినప్పటికీ, తాజా మార్పుల నేపథ్యంలో కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలని హైకమాండ్ నిర్ణయించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తన కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని భేటీ కావడం, ఈ పదవి ఆయనకే ఖరారైన సంకేతంగా చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రధాని మోదీతో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం.
బీజేపీ హైకమాండ్ ఇటీవల తెలంగాణలో మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో ఈటల రాజేందర్‌కు వ్యతిరేక వర్గాలు ఉన్నప్పటికీ, ఆయనకు బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు ఉండటంతో, పార్టీ ఆయనను ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో కొనసాగుతుండటంతో, రాష్ట్ర బీజేపీకి కొత్త నేతను నియమించాలని హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి 2028 ఎన్నికల వరకు పార్టీని నడిపించాల్సిన బాధ్యత వహించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని వినిపించడంతో, ఈటల రాజేందర్‌ను ముందుకు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈటల నాయకత్వంలో బీజేపీ బలపడుతుందా? అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.