చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR Review Meeting, kcr latest news, Mango News Telugu, Political Updates 2020, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020, Utilization of Small and Minor Water Resources

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 3, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో చిన్న నీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యాములు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యాములు అవసరమో గుర్తించి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతీ ఏటా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సిలు మురళీధర్ రావు, విజయ్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, సిఇలు వీరయ్య, హమీద్ ఖాన్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టీఎంసీల నీరు

‘‘ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతున్నది. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నది నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటాం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టీఎంసీల నీటిని తీసుకుంటాం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్ఆర్ఎస్పిలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లు నింపుకుంటాం. అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తాం. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుంది. పుష్కలమైన పంటలు పండుతాయి. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో పడుబాటు నీళ్లు, వర్షం నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడికక్కడ ఆపడానికి విరివిగా చెక్ డ్యాములు నిర్మించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్నిమంజూరు చేయాలి? అనే లెక్కలు తీయాలి. అవసరమైనన్ని చెక్ డ్యాములను గుర్తించిన తర్వాత వాటిలో సగం చెక్ డ్యాములను ఈ ఏడాదే నిర్మించాలి. దానికోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలి. మిగతా సగం చెక్ డ్యాములను వచ్చే ఏడాది నిర్మించాలి. చెక్ డ్యాముల నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని” సీఎం కేసీఆర్ చెప్పారు.

చెరువుల నిర్వహణకు ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించుకున్నాం. ఈ చెరువులు ఊరికి బతుకు దెరువుగా ఉపయోగపడుతున్నాయి. పునరుద్ధరించుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు, ఇతరత్రా మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలి. దీనికోసం ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేలా చూడాలి. గతంలో మాదిరిగా నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి. విఆర్ఎలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలి. చెరువుల్లో మొలిచే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని” సీఎం కేసీఆర్ చెప్పారు. వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున, వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్ఆర్ఎస్పికి తరలించాలని సీఎం చెప్పారు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పారు. తెలంగాణలో మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదల శాఖను ఐదారుగురు ఇఎన్సీల పరిధిలోకి తీసుకురావాలని, దీనికి తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. ఇఎన్సీలు తమ పరిధిలోని ప్రాంతంలో అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలని చెప్పారు. భారీ, మధ్య తరహా, చిన్న అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =