కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి గడ్డం వినోద్

Ex-minister Gaddam Vinod Joins In Congress Party

మాజీ మంత్రి గడ్డం వినోద్‌ జనవరి 11, శనివారం నాడు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ను కలుసుకున్న వినోద్ పలు అంశాలపై చర్చించారు. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో కీలకంగా పనిచేసిన వినోద్‌, ఆతర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌ కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరగా, తాజాగా వినోద్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వినోద్ చేరిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా మాట్లాడుతూ, వినోద్‌ పార్టీలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేస్తారని చెప్పారు. అలాగే వినోద్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీతో తనకు 35 ఏళ్లుగా సంబంధం ఉందని, మళ్ళీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో కొన్ని అపార్థాల కారణంగానే పార్టీని వీడాల్సి వచ్చిందని అన్నారు.

[subscribe]