పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

International Kite and Sweet Festival 2020 Conducts at Parade Grounds from Jan 13 to 15

హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఈసారి కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరగనుంది. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ పై జనవరి 11, శనివారం నాడు బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జనవరి 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ఫెస్టివల్ లో సుమారు 20 దేశాల నుండి 40కి పైగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారని అంతే కాకుండా సుమారు ఇరవై ఐదు రాష్ట్రాల నుండి 60 మంది కైట్ ప్లేయర్స్ తో పాటు హైదరాబాద్ కు చెందిన కైట్ క్లబ్ లు పాల్గొంటారన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంటిలో తయారు చేసిన 1000 రకాలకు పైగా స్వీట్ లను ఈ స్వీట్ ఫెస్టివల్ లో అమ్మకాలు జరుపుతారని వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ ఆటలును నిర్వహిస్తున్నామన్నారు.

జనవరి 13, 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ మరియు స్నాక్స్ పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో మూడురోజుల నుండి వారం రోజుల పాటు ఈ ఫెస్టివల్స్ జరుపుతామన్నారు. అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , షాపింగ్, వంటకాలు అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈసారి ఫెస్టివల్ కు 12 నుండి 15 లక్షల మంది వస్తారని అంచనావేస్తున్నామన్నారు. సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 5th ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లును మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ప్రభుత్వ అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్లిక్ ప్రతినిధులు బెంజిమెన్, అభిజిత్, వీణా, తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 14 =