తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ మూడో సారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో .. కటాఫ్ మార్కులపై విద్యార్దులకు టెన్షన్ పెరిగిపోతోంది. గతంలో రెండుసార్లు నిర్వహించి..తర్వాత రద్దు చేసిన ప్రిలిమ్స్‌తో పోలిస్తే జూన్ 9న జరిగిన పరీక్షలలో అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సారి 4.03 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3.02 లక్షల మంది అంటే 74% మంది ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ తెలిపింది.
తాజాగా జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశ్నపత్రం కొంచెం సులభంగానే ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు కూడా ఈజీ నుంచి కాస్త కఠినంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే కటాఫ్‌పై క్లారిటీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో అర్హత సాధించడానికి కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి 2022 ఏప్రిల్‌లో 503 ఉద్యోగాల భర్తీకి గ్రూప్-1 ఉద్యోగాల కోసం కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించడంతో పాటు 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు తేదీలను కూడా ప్రకటించింది. కానీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది కమిషన్. ఆ తర్వాత 2023 జూన్‌లో రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కడంతో.. కోర్టు ఆదేశంతో కమిషన్ ప్రిలిమ్స్‌ను మరోసారి రద్దు చేసింది.
ఈ ఏడాది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్తగా 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది కమిషన్. అంతేకాకుండా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును అప్డేట్ చేసుకొనే అవకాశాన్ని కల్పించడంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో..ఈ అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE