ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మనుషులపై దాడులు చేస్తూ రెచ్చిపోతున్నాయి. చివరకు వీధి కుక్కల దాడిలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో వీధి కుక్కల సమస్యపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు..వీధికుక్కలపై చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీకి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
దీని ప్రకారం తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ .. జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆదేశాల ప్రకారం వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారికి షాక్ ఇచ్చింది. స్ట్రీట్ డాగ్స్‌కు ఆహారం పెట్టేవారు ఇకపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ నగర పరిధిలో వీధి కుక్కలకు ఫుడ్ అందించేవారికి .. ఇక నుంచి వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ భోజనం పెట్టడం కుదరదని జీహెచ్ఎంసీ తేల్చి చెప్పింది. ఇక నుంచి వీధి కుక్కలకు భోజనం పెట్టాలంటే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ..అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాటికి ఆహారం పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి.. అధికారులు కొన్ని ప్రాంతాలను కేటాయిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది. తాము కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే.. స్ట్రీట్ డాగ్స్‌కు ఫుడ్ అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చివరకు వీధి కుక్కలకు ఆహారం అందించే వాలంటీర్లు, స్వచ్చంద సంస్థలు, సిటీ వాసులు ఎవరైనా సరే.. తప్పనిసరిగా జీహెచ్ఎంసీ వద్ద స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
స్ట్రీట్ డాగ్స్‌కు ఆహారం అందించడానికి ఇళ్లు, పాఠశాలలు,ప్లే గ్రౌండ్స్‌కు దూరంగా.. ప్రత్యేక ప్రదేశాలను కేటాయించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. తాము కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే స్ట్రీట్ డాగ్స్‌కు ఆహారం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో అయినా.. హైదరాబాద్‌లో వీధి కుక్కల స్వైర విహారం, కుక్క కాటు ఘటనలు తగ్గే అవకాశముంటుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.