తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారధి ఖరారు చేయనుండటం కోసం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.అయితే కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
పీసీపీ అధ్యక్షుడి ఎంపికతోపాటు కేబినెట్ విస్తరణపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకమాండ్ వద్ద చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే టార్గెట్ గా ఈ కొత్త నిర్ణయాలు ఉండనున్నాయి. దీంతో, కాంగ్రెస్ ఆశావాహులందరూ ఢిల్లీ నిర్ణయాల వైపు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అటు తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈరోజు ఏఐసీసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత అధిష్టానం తుది నిర్ణయం ప్రకటించనుంది.
మరోవైపు టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంలో మెల్లగా సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఇప్పటికే తమ అభిప్రాయం స్పష్టం చేసామని..టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియిమించినా తమకు అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా నలుగురి పేర్లు తుది పరిశీలనతో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు తుదిపరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుందనే కోణంలో హైకమాండ్ ఆలోచిస్తోంది. అయితే పీసీసీ పదవి ఏ సామాజిక వర్గానికి ఇస్తే, త్వరలో జరుగనున్న కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిందట.
టీపీసీసీ నిర్ణయంతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకుని మొత్తం 12 మంది మంత్రులు ఉండగా, మరో ఆరుగురికి కేబినెట్లో చోటు ఉంది. అయితే ప్రస్తుతం సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు లేదా నలుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు విస్తరణ జరిగితే ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకు చాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అదే విధంగా పెండింగ్ నామినేటెడ్ పదవులను కూడా ఈ ఢిల్లీ టూర్లోనే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.