తెలంగాణలో సన్నబియ్యం పంపిణీకి కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు
తెలంగాణలో పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మరింత చేరువయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, సన్నబియ్యం సాగును ప్రోత్సహిస్తూ రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. ఈ ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు సన్నబియ్యాన్ని ఎక్కువగా పండించారు. ఇప్పుడు, ప్రభుత్వం ఈ సన్నబియ్యాన్ని కొనుగోలు చేసి, నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేయేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు అధిక నాణ్యత కలిగిన సన్న బియ్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఉగాది పండుగ నాటికి రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటివరకు అందిస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, ప్రజలకు నచ్చే సన్న బియ్యాన్ని ఉచితంగా అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. చాలామంది పేదలు దొడ్డు బియ్యాన్ని తీసుకుని, షాపుల్లో తిరిగి ఇచ్చేసి, సన్న బియ్యం కొని వండుకోవడం ఈ నిర్ణయానికి కారణమైంది.
ఇటీవల తెలంగాణలో బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. మార్కెట్‌లో బియ్యం రేట్లు రోజురోజుకు పెరుగుతుండటంతో, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బియ్యం కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 53.95 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనిలో అధిక భాగం సన్న వడ్లే ఉండటంతో, మిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, పేదలకు సన్న బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మిల్లింగ్ ప్రక్రియలో సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసి, వేర్వేరుగా ప్రాసెస్ చేయడం ఈసారి తొలిసారి జరుగుతోంది.
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీతో పాటు, కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్నికల నియమావళి లేని జిల్లాల్లో తొలుత కొత్త కార్డులను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ పంపిణీ చేపట్టనున్నారు. కొత్త రేషన్ కార్డుల డిజైన్‌లు కూడా ఖరారైనట్లు సమాచారం.
సమగ్ర ప్రణాళికలతో పేదల సంక్షేమానికి మరింత దగ్గరయ్యేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ నిర్ణయం అమలు అయితే, పేదలు మార్కెట్‌లో ఎక్కువ ధరకు సన్న బియ్యం కొనాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు.