తెలంగాణలో రుణమాఫీ కానీ రైతులంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలున్నా కూడా రుణమాఫీ కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు విడుతల్లో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా కూడా ఇంకా తమ రుణం ఎందుకు మాఫీ కాలేదో తెలియక అయోమమానికి గురవుతున్నారు. సాగు పనులు వదులుకొని బ్యాంకులు, వ్యవసాయశాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో ఆర్జీలు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ కాని రైతులు వేల సంఖ్యలో ఉండడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నట్లు ఇటు అధికారులు చెబుతున్నారు.
చిన్నచిన్న పొరపాట్లతో తెలంగాణలో చాలా మంది రైతులు పంట రుణమాఫీకి దూరమయ్యారు. కొంతమందికి సాంకేతిక సమస్యలతో మాఫీ కాలేదు. ఆహార భద్రత కార్డు ఉండి కూడా రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతుల్లో కూడా రుణ మాఫీ కానివారున్నారు. కుటుంబంలో ఒక్క రుణమే తీసుకున్నా.. ధరణీ రికార్డు ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో బ్యాంకు లింకేజీ, ఈ కేవైసీ అప్‌డేట్ ఉన్నా కూడా తమ రుణం మాఫీ కాలేదని కొంతమంది వాపోతున్నారు. కుటుంబ సభ్యుల పేరుతో రెండు లక్షల రూపాయల పైన రుణం ఉన్న వారికి కూడా పథకం వర్తించక పోవడంతో అయోమయంలో ఉన్నారు.
రేషన్ కార్డుతో సంబంధం లేదని చెబుతున్న అధికారులు.. వాస్తవానికి మాత్రం రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయలేదు. కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం తాము ఇంటింటికి వచ్చి త్వరలోనే వివరాలు సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు.దీంతో అధికారులు నిర్ధారణ చేసేది ఎప్పుడో మాఫీ అయ్యేది ఎప్పుడంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులంతా కూడా రుణమాఫీకి అర్హులవుతారు. కాని పీఎం కిసాన్ వస్తున్న రైతుల్లో చాలా మందికి ఇప్పుడు తెలంగాణలో రుణమాఫీ కాలేదు. పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ లేక పోవడంతో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఇటు అధికారులు చెబుతున్నారు. చివరకు ఆధార్‌కార్డు నెంబరు సరి చేసే ఆప్షన్ కూడా అందులో లేదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. రైతులు అందిస్తున్న అర్జీలను తీసుకోవడం వరకే తమ బాధ్యతగా చెబుతున్నారు.
మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేసి ఖాతాలో జమ చేసిన డబ్బులు కొంతమంది రైతులు డ్రా చేసుకోకుండా బ్యాంకులోనే ఉంచుకున్నారు. ఇలాంటి రైతులు ఇప్పుడు నష్టపోయారు. తెలలంగాణ ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి వివరాలు తీసుకునే సమయంలో ఔట్ స్టాండింగ్ నిల్వలను చూపించడంతో రైతులకు బ్యాలెన్స్ పోనూ మిగతా డబ్బులు మాత్రమే జమ అయిందని బ్యాంకర్లు అంటున్నారు. ఎప్పటికప్పుడు రుణమాఫీ డబ్బులు డ్రా చేసుకున్న రైతులు లబ్ధి పొందగా, డబ్బులు భవిష్యత్తులో అవసరాలకు ఉంచుకున్న రైతులు మాత్రం నష్టపోయారు.
పంట రుణం మాఫీ కాకపోవడంతో తెలంగాణలోని చాలా జిల్లాలలో రైతులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసులకు, బ్యాంకులకు వెళ్లి అధికారులను నిలదీస్తున్నారు. రుణం తీరలేదని మనస్తాపంతో కొంతమంది రైతులు ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి.