తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో భాగంగా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో శుక్రవారం (అక్టోబర్ 31, 2025) మధ్యాహ్నం 12:15 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత మంత్రిగా ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు హాజరయ్యారు. తాజా విస్తరణతో తెలంగాణ కేబినెట్ బలం 16కు చేరింది. కాగా, కేబినెట్‌లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
రాజకీయ ప్రాధాన్యత:
తెలంగాణ కేబినెట్‌లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంలో భాగంగా మహమ్మద్ అజారుద్దీన్‌కు ఈ మంత్రి పదవి దక్కింది. అయితే, అజారుద్దీన్ ప్రస్తుతం శాసనసభ (MLA) లేదా శాసన మండలి (MLC)లో సభ్యులు కాదు. ఈ నేపథ్యంలో, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా నియమించబడతారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు ఈ మంత్రివర్గ విస్తరణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు కీలకం కావడంతో, వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికల కోడ్ పై ఆరా: కాగా, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అజర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడ్ ఏమైనా అడ్డు వస్తుందా? అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ముందుగానే ఆరా తీసినట్లు తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికల కోడ్ అడ్డురాదని వారు వివరించినట్లు సమాచారం.
 
			 
		






































