తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుస్తోందంటూ మంత్రులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.
కేటీఆర్ తప్పు చేశారు, జైలుకే వెళ్లాలి!:కోమటిరెడ్డి
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోమటిరెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ చేసిన తప్పు చిన్నది కాదని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయనకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో కేటీఆర్ ఏడేళ్లపాటు జైలులో ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ బెయిల్ కోసం శబరిమలకు మొక్కులు తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఏమిటి ఫార్ములా ఈ రేసింగ్ కేసు?
2023లో హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసింగ్ కోసం విదేశీ సంస్థకు రూ.55 కోట్లు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం క్యాబినెట్ అనుమతి లేకుండా చెల్లించారని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ (ACB) విచారణకు రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్‌పై ఏ క్షణమైనా ఏసీబీ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే చేశాం: కేటీఆర్
కేటీఆర్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే ఈ రేసును నిర్వహించామని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని అన్నారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. కొంతకాలం జైలులో ఉంటే యోగా చేస్తూ ఫిట్‌గా వచ్చేస్తానని ఎద్దేవా చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.
బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ కేసును పోలిటికల్ టార్గెట్ గా చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేటీఆర్‌ను టార్గెట్ చేస్తోందని, దీనికి ప్రతిస్పందనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని నేతలు పేర్కొన్నారు.
ఇక తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై వివరాలు అందించారు. క్యాబినెట్ భేటీలో ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక, ఈ కేసు గురించి మంత్రులకు వివరించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఇప్పుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు కీలక మలుపు తీసుకువచ్చే అవకాశముంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంటుండగా, బీఆర్ఎస్ దీన్ని ప్రతిపక్ష రాజకీయాలుగా చూస్తోంది. కేటీఆర్ అరెస్ట్‌కు దారితీస్తుందా? లేదా ఆయన ఈ ఆరోపణల నుంచి బయటపడతారా? అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారింది.