గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికను రేపు (ఫిబ్రవరి 11, గురువారం) మధ్యాహ్నం 12.30 గంటలకు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ముందుగా జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో రేవు ఉదయం 11.00 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్రేటర్ లో 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ 2 గెలుచుకున్నాయి. అయితే బీజేపీ పార్టీకి చెందిన లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ మరణించడంతో ప్రస్తుతం కార్పొరేటర్ల సంఖ్య 149 గా ఉంది. ఇక ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఇద్దరు లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు కలిపి 44 మంది ఉన్నారు. దీంతో మొత్తం జీహెచ్‌ఎంసీ పాలకమండలి సభ్యుల సంఖ్య 193 కు చేరుకుంది. అలాగే ఈసారి మేయర్ సీటును జనరల్ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే.
మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్‌అఫీషియో, కార్పొరేటర్లతో కలిపి 88 మంది సభ్యులు బలముంది. జీహెచ్‌ఎంసీ మేయర్ అభ్యర్థిని ఎన్నిక రోజునే ప్రకటిస్తామని, మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్ విధానం ద్వారా ప్రకటిస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ నిర్ణయించిన వారికే కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మద్ధతుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.
కాగా జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తాజాగా బీజేపీ పార్టీ కూడా ప్రకటించింది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను నిలబెడతామని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ నాయకులు తమ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి మీటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి లోని 193 సభ్యులకు గానూ 97 మంది హాజరై పూర్తి కోరం ఉంటేనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. కోరం లేకపోవడం లేదా ఏదైనా కారణాల చేత ఫిబ్రవరి 11 న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించలేకపొతే, మరుసటి రోజైన ఫిబ్రవరి 12న ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 12 న కూడా పూర్తి కోరం లేకుంటే మూడో సమావేశంలో హాజరైన సభ్యుల్లో ఎక్కువమంది ఎవరికీ మద్దతు ఇస్తే వారిని మేయర్, డిప్యూటీ మేయర్ గా ప్రకటించనున్నారు. మరోవైపు మేయర్ ఎన్నిక నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయ పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ