
తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 ఆధారంగా 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ఇకపై ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్ల ద్వారానే జరగాలి, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేపట్టరాదని వెల్లడించింది.
జీవో 16లో ఏముంది?
2016లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 ఆధారంగా విద్య, వైద్య, సాంకేతిక విద్యాశాఖలతో పాటు 40 విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. వీరిలో ప్రధానంగా 2,909 జూనియర్ లెక్చరర్లు, 390 పాలిటెక్నిక్ లెక్చరర్లు, 270 డిగ్రీ లెక్చరర్లు, 837 వైద్య సహాయకులు, 179 ల్యాబ్ టెక్నీషియన్లు, 158 ఫార్మాసిస్టులు, 230 శిక్షణాధికారులు ఉన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇది ఆర్టికల్ 14, 16, 21లకు విరుద్ధమని తెలిపింది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, రెగ్యులరైజేషన్ విధానానికి స్వస్తి పలకాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగుల భవిష్యత్?
2009 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను, ఇప్పటి విధుల నుంచి తొలగించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. వారిని కొనసాగించవచ్చని సూచిస్తూ, ఇకపై కొత్త నియామకాలు మాత్రం చట్టప్రకారం జరగాలని స్పష్టం చేసింది.
నిరుద్యోగుల అభ్యర్థనలు
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వల్ల నైపుణ్యంతో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గాయని నిరుద్యోగుల జేఏసీ వాదించింది. పీహెచ్‌డీలు పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా, గత 20 ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదని కోర్టుకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి
హైకోర్టు తీర్పు ప్రభావంతో రెగ్యులరైజ్ అయిన వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నియామక విధానం పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది.
ఈ తీర్పు ఉద్యోగ నియామకాలలో పారదర్శకతను పెంపొందించడంలో కీలక మలుపుగా నిలవనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య పరిష్కారానికి న్యాయస్థానం సూచనలు అమలు చేయడమే ప్రభుత్వానికి ఉన్న ప్రత్యామ్నాయం. తెలంగాణలో కొత్త ఉద్యోగ భవిష్యత్తు కోసం ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందా? లేదా వేరే సవాళ్లను తెస్తుందా? అన్నది రానున్న రోజుల్లో స్పష్టతకు వస్తుంది.