హైదరాబాద్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టడానికి టీజీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా టీజీఆర్టీసీ ఐటీ ఉద్యోగులను సుదూర ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు చేర్చేందుకు అనుగుణంగా బస్సులు నడపడానికి కసరత్తులు చేస్తోంది. ఒక మార్గంలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కనుక ఉంటే వారి ప్రయాణ వేళలకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ సర్దుబాటు చేస్తోంది.
ఘట్కేసర్ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు.. నాలుగైదు బస్సులు మారాల్సి వస్తోందని గతంలో చాలామంది వాపోయారు. దీనిపై ఆర్టీసీకి తమ అభ్యర్ధనలు పంపడంతో ఈ రూట్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తాజాగా ఇప్పుడు ఈ తరహాలోనే ఇతర ప్రాంతాల నుంచి మరో 40 బస్సులను హైటెక్ సిటీ వరకూ నడపడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వివిధ మార్గాల్లో నడుపుతున్న బస్సులతో పాటు తాజాగా బాచుపల్లి, ప్రగతీనగర్, మియాపూర్ మార్గాల్లో కూడా ఐటీ ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని బస్సు సర్వీసుల నడపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 25 మెట్రోగ్రీన్ లగ్జరీ బస్సులు, 15 వజ్ర బస్సులను ఐటీ కారిడార్‌వైపు నడుపుతున్నారు.
తాజాగా గాజులరామారం నుంచి వేవ్‌రాక్‌కు మరిన్ని బస్సులను నడపడానికి కసరత్తు చేస్తున్నారు. మహదేవ్‌పురం, ఎన్టీఆర్ గార్డెన్, ఎల్లమ్మబండ, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, హైటెక్‌సిటీ, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్‌రోడ్, విప్రో జంక్షన్ మీదుగా వేవ్‌రాక్ వరకు ఐటీ ఉద్యోగుల కోసం ఈ ప్రయాణ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్, ఉప్పల్, కోఠి, కూకట్పల్లి బస్టాప్ లను కలుపుతూ 195, 10హెచ్, 127కె, 222 మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE