తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఉన్న ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని టార్గెట్ చేసి సుప్రీం మెట్లెక్కి సుప్రీం ధర్మాసనం ముందు ఓటుకు నోటు కేసు ట్రాన్స్ఫర్ పిటీషన్ పెట్టారు. ఈరోజు జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం జగదీశ్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్ పైన విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం కేవలం అపోహ మాత్రమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఆధారాలు లేని ఆరోపణలు.. మీ అభ్యర్ధన కుదరదు ఇది ఊహాజనితమైన పిటిషన్ అని ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయలేమని పేర్కొంది. రేవంత్ రెడ్డి విచారణ ప్రభావితం చేసే స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు విచారణలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని ఒకవేళ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది.
దర్యాప్తు విషయంలో సీఎంకు, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు కూడా ఈ విచారణను చాలా పారదర్శకంగా చేపట్టాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా సుప్రీం ధర్మాసనం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆచితూచి మాట్లాడాలని పేర్కొని తాను చేసిన వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను ధర్మాసనం అంగీకరించింది. మొత్తంగా ఈ వ్యవహారంలో కోర్టు నిర్ణయంతో బిఆర్ఎస్ మాజీమంత్రి జగదీశ్ రెడ్డి కి షాక్ తగలగా, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్టు అయింది. కాగా తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయటం కోసం ఆయుధాలను వెతుకుతూనే ఉంది.