రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బోనస్ ఈ సీజన్ నుంచే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షనిర్వహించారు.
ఈ సందర్భంగా ధాన్యం సేకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి అనేక సూచనలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపే ఎలాంటి ఆటంకాలు లేకుండా.. సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
ధాన్యం అమ్మిన తెలంగాణ రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా..మిగిలిన ప్రాంతాలలో అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని.. రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం తెలిపారు.
సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ను కేటాయించి, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలని రేవంత్ చెప్పారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించకూడదని రేవంత్ స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా గోనె సంచులు, టార్ఫాలిన్లు, డ్రయర్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ధాన్యం సేకరణలో సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అలాగే అక్టోబర్ 5 వ తేదీలోగా DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణలో 11వేల 62 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన.. డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ..అక్టోబర్ 9న వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. సెక్రటేరియట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన రేవంత్ రెడ్డి నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.