ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు.ఈ రోజు రాత్రి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లక్నవరంలో బస చేయనున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకుంటారు. అక్కడ గవర్నమెంటు గెస్ట్ రూమ్‌లో అరగంట పాటు బస చేయనున్నారు. ఆ తర్వాత మధ్నాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో ఆయా శాఖల అధికారులను పరిచయం చేసుకోనున్నారు.
ఇక ఒంటి గంట నుంచి మధ్నాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ .. 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై వారితో మధ్యాహ్నం లంచ్ చేయనున్నారు. అలాగే 3 గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించి అక్కడ పూజలు నిర్వహించనున్నారు.
అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 6:30 గంటలకు లక్నవరం సరస్సు వద్ద ఉన్న హరిత రిసార్ట్ కు చేరుకొని అక్కడ రాత్రి గవర్నర్ బస చేయనున్నారు.ఆగస్ట్28న హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో గవర్నర్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి వరంగల్ నిట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఆగస్ట్ 29న మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శించనున్నారు.
మరోవైపు ఇప్పటికే గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటనతో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానుండటంతో.. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లను చేశారు.