తెలంగాణతోపాటు, ఏపీలో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 31న ఖాళీ అవబోతుండటంతో.. ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవున్నాయి. ఈ స్థానాలకు బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది.కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ నిర్ణయించింది.
మొన్నటి వరకు మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని జీవన్‌రెడ్డి భావించినా..ఇటీవలి పరిణామాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీనిపై ఏఐసీసీకి సమాచారం ఇవ్వడంతో.. నరేందర్‌రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని మంత్రి డి.శ్రీధర్‌బాబు జనవరి 30న వెల్లడించారు. దీంతో ఆ మరుసటి రోజే నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
నరేందర్‌రెడ్డి ఎంపిక వెనుక అధిష్టానం పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. ముందుగా నరేందర్‌రెడ్డితో పాటు ప్రసన్న హరికృష్ణ పేరును కూడా పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 42 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎంపీల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో సగానికిపైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ఉండటంతోనే కాంగ్రెస్ పార్టీ నరేందర్‌రెడ్డివైపు ఎక్కువగా మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
కాగా.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించి ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. అలాగే నామినేషన్ ఉప సంహరణ కోసం ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.