దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో, సిద్దిపేటకు చెందిన మహిళ ఈ అరుదైన నరాల వ్యాధితో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉంది.
మహారాష్ట్రలో ఇప్పటికే 100కి పైగా జీబీఎస్ కేసులు నమోదవ్వడం, మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉందన్న భయం నెలకొంది. వైద్యుల ప్రకారం, బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేయడం వల్ల ఈ వ్యాధి ఉత్పన్నమవుతుంది.
జీబీఎస్ లక్షణాల్లో ఒళ్లు తిమ్మిరిగా మారడం, కండరాలు బలహీనపడటం, డయేరియా, పొత్తికడుపు నొప్పి, వాంతులు, శ్వాసకోస సమస్యలు కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి కాకపోయినా, కాలుష్యమైన ఆహారం మరియు నీటివల్ల ఇది వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వ్యాధికి సమయానికి సరైన చికిత్స అందిస్తే రోగులు కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే, చికిత్స ఖరీదైనది. ప్రత్యేకంగా ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు వేలల్లో ఖర్చవుతాయి. జీబీఎస్ బారినపడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కీలకం. ఎందుకంటే, ఈ వ్యాధి నరాల వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి, శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.