హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదంపై విద్యార్థులు నిర్వహించిన నిరసనల నేపథ్యంలో బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై నకిలీ వీడియోలు వైరల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దిలీప్, క్రిశాంక్‌లపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) కింద 353, 1(C), 353(2), 192, 196(1), 61(1)(a) సెక్షన్ల ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం
ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై విచారణ జరుగగా, భూముల విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్, రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ప్రశ్నించింది.
ఎందుకు అత్యవసర కార్యకలాపాలు?
భూమి విషయంలో ఎందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది? చెట్లను నరకడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) అనుమతి తీసుకున్నారా? అనే అంశాలపై కోర్టు సందేహాలను వ్యక్తం చేసింది. ఒకే రోజులో వంద ఎకరాల్లో చెట్లు నరుకడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రతివాదిగా చేర్చారు.
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఈ వ్యవహారంపై మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా, సుప్రీం న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని నిలదీశారు. “30 ఏళ్లుగా ఈ భూమి వివాదంలో ఉంది, కానీ అవి అటవీ భూములు అని నిర్ధారణ చేసే ఆధారాలు లేవు” అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేశారు.