తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటం లేదు. నేడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 మంది చనిపోయారు. ట్రైన్ల ట్రాక్‌లు కొట్టుకుపోవంతో రైలు ప్రయాణాలుకు అంతరాయం ఏర్పడటంతో పలు ట్రైన్లు రద్దు చేశారు. ఇక జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక తెలంగాణలో అయితే ఎక్కడ చూసిన వర్షం బీభత్సమే సృష్టిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా తేరుకోలేదు. అప్పుడే ఐఎండీ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. సోమవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని మరోసారి భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌తోపాటు 6 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేటజిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున తీరం దాటింది. కళింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటినట్టు ఐఎండీ వెల్లడించింది. అక్కడి నుంచి వాయువ్య దిశగా కదులుతూ.. ఆదివారం సాయంత్రానికి రామగుండానికి 310 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది. ఇవాళ ఛత్తీస్‌ఘడ్, విదర్భ మీదుగా కదులుతూ.. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రుతు పవన గాలుల ద్రోణి మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా.. బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని అధికారులు వివరించారు.
మరో 24 గంటల్లో తుపాను తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించారు. నేడు ఏపీ, తెలంగాణలకు కేంద్రం రెస్క్యూ టీంలను పంపించనుంది. పదుల సంఖ్యలో గల్లంతు కావటంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు.