రెండో దశ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో ట్రైన్‌ను పరుగులు పెట్టించడానికి హెచ్‌ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ముందడుగు వేసింది. దీనిలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను హెచ్ఎంఆర్ వేగవంతం చేసింది. ఈ మెట్రో రూట్‌లో సుమారు 1200 ఆస్తులపై ప్రభావం ఉంటుంది మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం దీనిపై ఇప్పటికే 400 ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్టు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ జరుగుతోందని, మెట్రో స్టేషన్ల వద్ద మాత్రం 120 అడుగుల వెడల్పులో రోడ్డు విస్తరణ ఉంటుందని అన్నారు. దారుల్ షఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుతం రోడ్డు వెడల్పు 50 అడుగుల నుంచి 60 అడుగుల వరకు, శాలిబండ జంక్షన్ నుంచి చంద్రాయణ గుట్ట జంక్షన్ వరకు 80 అడుగుల రోడ్డు వెడల్పు ఉందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. దారుల్ షఫా నుంచి శాలిబండ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట మధ్య వరకూ 10 అడుగుల మేర విస్తరణ చేయాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, టర్నింగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రోడ్డు విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందని అన్నారు. భూసేకరణ కోసం సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్దతులతోపాటు త్రీడీలో వీక్షించేలా.. లైడార్ డ్రోన్ సర్వేను కూడా తాము చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. పాతబస్తీలో మెట్రో రైలు కోసం భూసేకరణ ప్రక్రియ 8 నెలల్లోనే పూర్తవుతుందని, దీని వల్ల ప్రభావితం అయ్యే యజమానులు.. తమ అభ్యంతరాలన్నిటినీ నిర్ణీత గడువులోగా మెట్రో రైలు భూసేకరణ ఆఫీసర్ యొక్క కార్యాలయం వద్ద దాఖలు చేయాలని సూచించారు.