హైడ్రా అనుబంధంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో జనవరి 6 నుంచి బుద్ధ భవన్‌లో హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభమవుతాయి. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై నిర్ణయాలు తీసుకుంటారు.
గ్రీవెన్స్ విధానం: బుద్ధ భవన్‌లో జరిగే హైడ్రా గ్రీవెన్స్ కార్యక్రమంలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫిర్యాదులపై హైడ్రా 10 రోజుల్లోపే పరిష్కారం అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. స్థానిక ఎమ్మార్వోలు, రెవెన్యూ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారు హాజరుకాకపోతే టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సహకరించనున్నారు.
హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభం: ఇప్పటి వరకు ప్రజలు ఎదురుచూస్తున్న హైడ్రా పోలీస్‌స్టేషన్ సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానుంది. డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులతో పాటు సీఐలు, ఎస్‌ఐలు హైడ్రా పీఎస్‌లో విధులు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హైడ్రా పోలీస్‌స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆక్రమణల నివారణలో హైడ్రా ఇప్పటికే దూకుడు చూపిస్తోంది. ఖాజాగూడ, మల్కాజ్‌గిరిలో ఇటీవల ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా, ఇప్పుడు మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తోంది.
హైడ్రా కార్యాలయానికి ఇప్పటి వరకు వచ్చిన 5,000కు పైగా ఫిర్యాదుల్లో అధికంగా నగర శివారుల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చాయి.
హైడ్రా వద్దకు వచ్చిన ప్రతీ ఫిర్యాదుదారుడికి న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారం అందించేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించిందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. “హైడ్రా వద్దకు వస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని ప్రజలు విశ్వసించాలి” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
ప్రజల కోసం మరింత మెరుగైన సేవలు అందించేందుకు హైడ్రా చేపట్టిన ఈ చర్యలు సమస్యల పరిష్కారంలో కొత్త మార్గం సృష్టిస్తాయని ప్రజలు భావిస్తున్నారు. హైడ్రా గ్రీవెన్స్, హైడ్రా పోలీస్‌స్టేషన్‌తో ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని అందరూ ఆశిస్తున్నారు.