తెలంగాణలో వాతావరణం వేగంగా మారి.. వారం రోజులుగా చలి ప్రభావం పెరుగుతూ వస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుండగా.. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. దీనికితోడు చల్ల గాలులు వీస్తుండటంతో.. చిన్నారులు,వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆస్తమా, సైనస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు రాబోయే మూడు రోజులు తెలంగాణ వాసులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిజానికి వారం రోజుల నుంచి తెలంగాణలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకన్నా తక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గుతాయని తాజాగా అధికారులు వెల్లడించారు.
చలి తీవ్రత పెరగడంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతోపాటు, వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, రోగులు బయటకు రాకపోవడమే మంచిదని అంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అస్సలు బయటకు రావొద్దని అంటున్నారు. వాతావరణం మారుతుండటంతో.. ఇన్‌ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజావల్ల జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు
చలి ఎక్కువగా ఉండే సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని..శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలని వైద్యులు చెబుతున్నారు. వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలని.. కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దని అంటున్నారు. గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటే మంచిదని సూచిస్తున్నారు. అలాగే అనారోగ్యంగా ఉన్నవారితో సన్నిహితంగా ఉండాలని..నీరు ఎక్కువగా తాగాలని అంటున్నారు.