తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సర్వే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ పథకం కింద సొంత స్థలాల ఉన్నతిని నిర్ధారించడం మొదలుకొని, అవసరమైన నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచడం వరకు కీలక చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మొత్తం 80.54 లక్షల అప్లికేషన్లు అందగా, ఇప్పటివరకు 31.58 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే కొనసాగుతున్న ఈ ప్రక్రియ సంక్రాంతి వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సర్వేలో గుర్తించిన
దరఖాస్తుదారులలో కేవలం 9.19 లక్షల మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. ఈ స్థలం ఉన్నవారిలో పెంకుటిళ్లలో 2.35 లక్షల మంది, సిమెంట్ రేకుల ఇళ్లలో 2.17 లక్షల మంది నివసిస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం కలిగిన 4.50 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తారు.
400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక, 180-190 సిమెంట్ బస్తాలు, 1.5 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరం. వీటిని తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్కెట్ ధరలు అధికంగా ఉండడంతో సిమెంట్, ఉక్కు ధరలను తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయి.
500 మండల కేంద్రాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నమూనా ఇళ్లను వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులు ఎక్కువగా ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సర్వే పూర్తయ్యాక, గృహ నిర్మాణానికి కావాల్సిన అవసరాలను ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ఇసుక, సిమెంట్, ఉక్కు వంటి అవసరాలను తక్కువ ధరల్లో అందించనుంది.