ఇంటింటికి ఇంటర్నెంట్ అందించాలని గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన ప్రయత్నాన్ని..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. టీ ఫైబర్‌కు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర టెలీకాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నెలకు 300 రూపాయలకే తెలంగాణలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. టీ-ఫైబర్‌కు వడ్డీ రహిత రుణం రూ.1,779 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. ఢిల్లీలోని జ్యోతిరాదిత్య సింధియా కార్యాలయంలో శుక్రవారం కలిసి తెలంగాణకు సంబంధించిన అంశాలను వివరించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. టీ ఫైబర్‌తో తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆ ప్రాజెక్టులో భాగంగా 65,500 గవర్నమెంట్ ఆఫీసులకు జీ2జీ అంటే గవర్నమెంట్ టూ గవర్నమెంట్, అలాగే జీ2సీ అంటే గవర్నమెంట్ టూ సిటీజన్ కనెక్టివిటీ కల్పించడంతోపాటు తెలంగాణలోని అన్ని ఇళ్లకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ వంటి సర్వీసులు అందించాలనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 300 రైతు వేదికలకు, సాంఘిక సంక్షేమ పాఠశాలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్ల రూపాయలను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి చెప్పారు. మొత్తం పెట్టుబడి వ్యయం 1,779 కోట్ల రూపాయలను యూఎస్ఎఫ్ఓ ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాని రేవంత్ రెడ్డి కోరారు. రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్ధేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని.. టీ ఫైబర్ కు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.