ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి రెండు మ్యాచ్‌లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో, మార్చి 27న లఖ్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌ల టికెట్లను డిస్ట్రిక్ జొమాటో యాప్‌లో అందుబాటులో ఉంచారు. అయితే, తక్కువ ధరలో ఉన్న టికెట్లు తక్కువ సమయంలోనే అమ్ముడైపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టికెట్లను బ్లాక్ చేస్తున్నట్టు ఆరోపణలు వెలువడగా, హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఈ వ్యాఖ్యలను ఖండించారు.
హెచ్‌సీఏ స్పందన
“హైదరాబాద్ మ్యాచ్‌ల టికెట్లు బుక్‌మైషోలో కాకుండా, డిస్ట్రిక్ జొమాటో యాప్‌లో విక్రయించబడుతున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల టికెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సరైన సమాచారం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అభాసుపాలు. ఐపీఎల్ టికెట్లపై నియంత్రణ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే, హెచ్‌సీఏది కాదు. బీసీసీఐ, హెచ్‌సీఏ కేవలం ఏర్పాట్లను మాత్రమే పర్యవేక్షిస్తాయి, టికెట్ల విక్రయానికి మేము బాధ్యతవహించం. హెచ్‌సీఏ ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేయడం సహించం. దేశవ్యాప్తంగా హెచ్‌సీఏను ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారంపై హెచ్చరిక
“ఐపీఎల్ టికెట్ల దందా అంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపనున్నాం. నిరాధారమైన ఆరోపణలతో హెచ్‌సీఏపై బురదజల్లే వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టీటీడీ విడుదల చేసే రూ.300 టికెట్లు త్వరగా అయిపోతే ఇలాగే ఆరోపణలు చేస్తారా? తక్కువ ధర టికెట్లకు విద్యార్థులు, యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు, అందుకే అవి త్వరగా అమ్ముడవుతాయి. టికెట్లపై ఎటువంటి సందేహాలున్నా సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని లేదా డిస్ట్రిక్ జొమాటో యాప్ ప్రతినిధులను సంప్రదించండి,” అని అర్శనపల్లి జగన్మోహన్ రావు సూచించారు.