తెలంగాణ ఎన్నికల వేళ జాతీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వారిది ప్రాంతీయ పార్టీ అని.. హైదరాబాద్‌లోనే ఉంటూ పాలన సాగిస్తామని.. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం తమకు లేదని పదే పదే చెప్పారు. జాతీయ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక్కడి నాయకులకు పదవులు వచ్చినా రిమోట్ మాత్రం ఢిల్లీ పెద్దల చేతిలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. వారు ఆడమన్నట్లే ఆడుతారు తప్పించి.. వీరికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని అన్నారు. ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చినా వారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే సరిపోతుందని.. ఇంకా ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. అయితే అప్పుడు కేసీఆర్ అన్నట్లుగానే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఏడు నెలలు అయింది. ఈ ఏడు నెలల సమయంలో ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ రెడ్డి పదుల సంఖ్యలో ఢిల్లీకి వెళ్లారు. ప్రతి చిన్న విషయానికి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ సాగుతోంది. తెలంగాణతో పాటు కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైనా అత్యవసరమయితే తప్పించి.. ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను కలవడం లేదు. వారి రాష్ట్రంపైనే దృష్టి పెట్టి పాలన సాగిస్తున్నారు. అటువంటిది రేవంత్ రెడ్డి నెలలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే దానిపై పెద్ద ఎత్తునే చర్చ మొదలయింది.
ఢిల్లీ పెద్దలను మంచి చేసుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే హైకమాండ్ మెప్పుకోసమే రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారట. కేవలం తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పడుతున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పదే పదే చెబుతున్నారు.. తెలంగాణను పాలించేది రేవంత్ రెడ్డి కాదు ఢిల్లీ పెద్దలు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి వెళ్తుండడంతో ఆ మాటకు బలం చేకూరినట్లు అవుతోంది. ఈ మాట మరింత బలపడితే కచ్చితంగా కాంగ్రెస్‌కు డ్యామేజీ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ అవన్నీ మరిచిపోయి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి వెళ్లడంపై బిగ్ డిస్కషన్ జరుగుతోంది.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదని.. తన ఫామ్‌హూజ్‌లోనే ఉంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు ఫామ్ హౌజ్ ముఖ్యమంత్రి అని అప్పట్లో పేరు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాలను అటుకెక్కించి ఢిల్లీ పెద్దలు చూట్టూ తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలప్పుడు తాము ఏదైతే చెప్పామో.. అదే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారని అంటున్నాయి. ఏది ఏమయినప్పటికీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేయడం శృతి మించిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పదే పదే ఆయన ఢిల్లీకి వెళ్లడం వల్ల పార్టీకి డ్యామేజీ జరిగే అవకాశం లేకపోలేదనేది విశ్లేషకుల మాట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF